
- ఇద్దరినీ ప్రశ్నించిన పంజాగుట్ట పోలీసులు
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజాగుట్ట పోలీసులు గురువారం విచారించారు. వాళ్లిద్దరికీ పోలీసులు నోటీసులు ఇవ్వగా.. విష్ణుప్రియ తన న్యాయవాదితో ఉదయం 10:30 గంటలకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆమెను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ విచారించారు. ఆమె విచారణ కొనసాగుతుండగానే రీతూచౌదరి మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్‌కు వచ్చారు.
ఈ ఇద్దరినీ కలిపి, విడివిడిగా విచారించినట్టు సమాచారం. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 9:25 గంటలకు స్టేషన్ నుంచి పంపించారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రీతూచౌదరి పోలీసులకు పలు వివరాలను వెల్లడించినట్టు సమాచారం. విష్ణు ప్రియ చెప్తేనే తాను ప్రమోషన్స్ చేశానని, ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ఆమెనే తనకు నేర్పించిందని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
కాగా, ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మొదట పోలీసులు విష్ణుప్రియ బ్యాంక్ లావాదేవీలు పరిశీలించారు. తర్వాత బెట్టింగ్ యాప్‌ల నుంచి వచ్చిన నిధుల గురించి ఆరా తీశారు. తాను కేవలం మూడు బెట్టింగ్ యాప్‌లకు మాత్రమే ప్రమోషన్ చేశానని విష్ణుప్రియ పోలీ సులకు తెలిపినట్టు తెలిసింది. విష్ణుప్రియ ఒక్కో వీడియోకు రూ.90 వేలు తీసుకునేదని, వాటిని ఇన్స్టాగ్రామ్ద్వారా ప్రమోట్చేసేదని తెలిసింది.
విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. ఆమె ఫోన్ సీజ్ చేశారు. అయితే ఆ తర్వాత ఇచ్చేశారు. మరోవైపు రీతూచౌదరి మొదట విచారణకు సహకరించలేదు. అయితే ఆ తర్వాత వివరాలు చెప్పింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని వాపోయినట్టు సమాచారం. రీతూచౌదరి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. ఆమె ఫోన్ సీజ్ చేశారు.
దుబాయ్‌కి పారిపోయిన హర్షసాయి, ఇమ్రాన్‌ఖాన్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో పంజా గుట్ట పోలీస్‌స్టేషన్‌లో11 మందిపై కేసులు నమోదు కాగా.. వీరిలో హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ లేదా బ్యాంకాక్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా వీరు విచారణకు రాకపోవడంతో వీరిద్దరూ ఎక్కడున్నారని పోలీసులు నిఘా పెట్టినట్టు తెలిసింది.
ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. నటి శ్యామల, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులిచ్చారు. వీరి విచారణ తర్వాత మిగతా వారికి సైతం నోటీసులు ఇవ్వనున్నారు. కాగా, నోటీసులకు స్పందించకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.